బతుకమ్మ జ్ఞాపకాలు
బతుకమ్మ …
పలుకులోనే ఎంతటి కమ్మదనం ,నిండుదనం ఉందొ కదా !
తెలంగాణా బతుకు చిత్రం అంతా బతుకమ్మలోనే దాగి ఉంది .
గునుగులా గుచ్చుకునే గాయాలెన్నో ఉన్నాయి .
తంగేడులా తళతళా మెరిసే మాగాణులెన్నో ఉన్నాయి.
ముద్దబంతిలా ముచ్చటగొలిపే కట్టడాలెన్నో ఉన్నాయి.

తీరొక్క పువ్వుల్లా తీరొక్క ముచ్చట్లు బాధలు ఉన్నాయి.
ఇన్నాళ్లు యాదిజేసుకుని బాధపడ్డది చాలు కానీ నా చిన్నతనంలో బతుకమ్మ పండుగకి ఇప్పుడు జరుగుతున్న పండక్కి మధ్య చిన్న తేడాను మీతో పంచుకుంటాను.
రజాకార్లు, రాచరిక పాలనప్పటి రోజుల్లోకి వెళ్లట్లేదు కానీ తెలంగాణా రాకముందు వచ్చాక ఓ రెండు మూడేళ్ళ తేడా చెప్తా .
బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు ఓ తొమ్మిది రోజులు సెలవు ..అవ్వ చెద్దరు గుంజి లేపినా బడికి టైం అయ్యేదాకా లేవని నేను , అవ్వకంటే ముందే లేచి పువ్వుకు పోతాను అనేది , పండక్కి రెండు కొత్త డ్రెస్సులు కావాలని అడిగితే మగపోరనివి నీకెందుకురా బతుకమ్మ పండక్కి డ్రెస్సు అని దసరాకు మాత్రం ఒక్కటి కొనిచ్చేది . సద్దుల బతుకమ్మ నాడు సద్ది పట్టుకుని బతుకమ్మల కంటే ముందే పోరాగాళ్లతో కలిసి చెరువు కట్టకు చేరుకునేది .దసరా పండుగనాడు కడుపునిండా తిని ఎంతో సంబరంగా గడిపేది …
ఇక అప్పట్లో టీవీ ఛానెళ్లలో ఈ పండుగకు ఇచ్చిన ప్రాధాన్యత గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటించిన విద్యాశాఖ అనే ఒక వార్తా , ఈరోజు తెలంగాణాలో సద్దుల బతుకమ్మ అని ఒక హెడ్లైన్ , మరునాడు రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన దసరా సంబరాలు అనే ఒక వార్తా ..ఖతం …
ఇంతగొప్ప సంస్కృతి అని ,ఇంతమంది కళాకారులు ఉన్నారని ఆ చిన్నతనంలో తెలిసేది కాదు . ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ వార్తా ఛానెళ్లలో ఈ పండుగకు ప్రాధాన్యత అయితే పెరిగింది అని చెప్పుకోవచ్చు …ఒకదానికి ఒకటి పోటీపడి మరి బతుకమ్మ పాటల చిత్రీకరణ , ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేసి సంబరాలు నిర్వహించడం నేనైతే ఊహించనిదే.
తెలంగాణా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
.


