అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన

కొత్త ఢిల్లీకి చెందిన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ పి. నాగజ్యోతి, శ్రీమతి సీతా నాగజ్యోతి ల శిష్యులు హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పారామంలో ‘కూచిపూడి దర్పణం’ పేరిట కూచిపూడి నృత్యరీతులను జూన్ 16వ తేదీన ప్రదర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీ వి. శేషాద్రి, ఐఎఎస్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.  కూచిపూడి నృత్యరీతిని వ్యాప్తి చేయడంలో విశిష్ట కృషి చేసిన గురువులను కొనియాడి, తన కుమార్తె శ్రియ వీరి శిష్యురాలైనందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రదర్శనను ఢిల్లీకి చెందిన గురువులు హైదరాబాద్‌లోని శిష్య బృందం పూర్వరంగంతో ప్రారంభించారు.  ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు కీర్తి శేషులు డాక్టర్ వెంపటి చినసత్యం వసంతరాగంలో రూపొందించిన స్వరజతి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది.  అనంతరం ప్రదర్శించిన ‘వాణికి వందనం’, ‘దశావతారం’, ‘ఔరశబ్దం’, ‘తులసీదాస్ కీర్తన’, ‘కొలువైతివా’, బృందావన సారంగ థిల్లాన’ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 

కూచిపూడి గురువులైన నాగజ్యోతి దంపతులు, ఈ నాట్యరీతిలో ఎంతో కృషి చేసి, తమకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకొన్నారు.  కీర్తి శేషులు పద్మ భూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం శిష్యురాలైన శ్రీమతి సీత నాగజ్యోతి 1960వ దశకంలో ఆయన వద్ద నాట్యం అభ్యసించి, 1980వ దశకం వరకూ కూచిపూడి ఆర్ట్ అకాడమీ ద్వారా ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు.  హైదరాబాద్ శాఖలో ఆమె వద్ద కూచిపూడి నాట్యాన్ని నేర్చుకొన్నవారు ఎందరో, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.  నాగజ్యోతి దంపతులు ఢిల్లీ, హైదరాబాద్ కు చెందిన తమ శిష్య బృందం చేత సాంప్రదాయ రీతిలో తాము రూపొందించిన నృత్య రీతులను ప్రదర్శించారు.

గత వారం (జూన్ 10-15) హైదరాబాద్‌లో శ్రీమతి సీతా నాగజ్యోతి ‘బేక్ టు బేసిక్స్’ (తిరిగి మూలాలకు) వర్క్‌ షాప్ నిర్వహించారు.  డాక్టర్ యశోదా ఠాకూర్ రిందాశరణ్య కూచిపూడి ఆర్టిస్ట్ అకాడమీతో కలసి ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్ లో నేర్పించిన ‘స్వర జతి’ ఈ రోజు ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలో…ప్రొఫెసర్ టి.జి. రూప, భమిడిసాయి శిరీష, ఎల్. శృతి, శ్రియ శేషాద్రి, కావ్య గోపాలకృష్ణ, రుద్ర వైష్ణవికరణం, శివాని, కీర్తన సుబ్రహ్మణ్యం, సాయి యుక్త, పి. చార్వి, శ్రీ మేఘ, శ్రీ మనస్వి, చరిత లు పాల్గొన్నారు.

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *