అందరికీ పోషకాహారం’పై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

పోషణ్ మాస్ (జాతీయ పోషకాహార మాసోత్సవం)’ సందర్భంగా కేంద్ర సమాచార సంస్థ (సీబీసీ) ఆధ్వర్యంలో ‘అందరికీ పోషకాహారం’పై హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అయిదు రోజుల సమగ్ర సమాచార, అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖతో పాటు జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) వంటి జాతీయ సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారు.

సదస్సులో తాజా ఆహార మార్గదర్శకాలు, స్థూల-సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం, ఆహారంలో పోషక వివరాలను గుర్తించే విధానం వంటి అంశాలతో కూడిన ఫోటో ప్రదర్శనను నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన వివిధ చిత్రాలు తాలూకు వివరాలను పీఐబీ, సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ దగ్గరుండి గవర్నర్ కు వివరించారు. ఎన్ఐఎన్, ఎఫ్ఎస్ఎస్ఏఐల సమన్వయంతో కేంద్ర సమాచార సంస్థ కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించింది. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ‘అందరికీ పోషకాహారం’ ఇతివృత్తంపై మొత్తం 40 అంశాలను ప్రదర్శించారు.
ఇలా తెలుగులో ఏర్పాటు చేయడం వల్ల సమాచారం మరింత ఎక్కువ మందికి చేరుతుందంటూ గవర్నర్ ప్రశంసించారు. ఐసీఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ, రాష్ట్ర మహిళాభివృద్ధి-శిశుసంక్షేమ శాఖ, కేంద్ర ప్రచురణల విభాగం, న్యూట్రి హబ్, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ, విశ్వవిద్యాలయ ఆహార-పోషక విభాగం కూడా ఈ కార్యక్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ‘‘వివిధ రకాల సంస్కృతులు, భాషలతో కూడిన వైవిధ్యభరితమైన మన దేశంలో పోషకాహార అంశాలపై అవగాహనతో కూడిన సమాచారాన్ని ప్రజలందరికీ చేరవేయడం ఒక సవాలు” అని అన్నారు. సృజనాత్మక వ్యూహాల ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించి పోషకాహారంపై సామాజిక నడవడికలో పరివర్తన తేవడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని ఆయన అన్నారు.

పోషకాహారంపై సందేశాలతో బుర్రకథ, పల్లె సుద్దుల వంటి జానపద కళారూపాలను గవర్నర్ వీక్షించి, ఆ ప్రయత్నాన్ని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కూడా ఈ తరహా ప్రయత్నాలు చేయాలని సూచించారు. రక్తహీనత నిర్మూలన, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడంపై కళారూపాల ద్వారా సందేశం అందించడం వల్ల అది కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలు సహా చేరాల్సిన వారందరికీ చేరుతుందని ఆయన అన్నారు.
వికసిత్ భారత్’ సాధించే దిశగా ప్రభుత్వంతో కలసి అడుగేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. దీనిలో ఆర్థికాభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక, మానసిక శ్రేయస్సు మిళితమై ఉందన్నారు. ‘పోషణ్ బీ పడాయి బీ పథకం’ అంగన్వాడీ కేంద్రాలను పోషకాహారం, విద్య అందించే సమీకృత హబ్ లుగా మారుస్తుందని తెలిపారు. ఈ విధానం శారీరక, మానసిక వికాసం పెంపొందించి మంచి భవిష్యత్తు ఇస్తుందన్నారు.

పీఐబీ, సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శ్రుతి పాటిల్ మాట్లాడుతూ ‘‘ఇటీవలే ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో భావిపౌరులైన చిన్నారులకు పోషకాహార ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించేందుకు అందరూ తమ వంతు పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారని, దాన్ని సాకారం చేసే దిశగా చేపట్టిన చిరు ప్రయత్నమే ఈ ఫొటో ఎగ్జిబిషన్’’ అని తెలిపారు.
జాతీయ పోషకాహార సంస్థ ఐసీఎంఆర్ జీవ రసాయన శాస్త్ర విభాగ అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ జి భాను ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎమ్ విజ్జుల్లత, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి విభాగ అధికారులు, తెలంగాణా ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోషణ్ అభియాన్(ప్రధానమంత్రి సమగ్ర పోషణ పథకం) కార్యక్రమాన్ని రాజస్థాన్ లోని ఝున్ ఝును జిల్లాల్లో మార్చి8, 2018న ప్రధానమంత్రి ప్రారంభించారు. కౌమార బాలికలు, గర్భిణీలు, బాలింతలు, 0-6 ఏళ్ల వయసున్న పిల్లల్లో పోషకాల స్థాయి పెంచడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.

