గోనెపల్లి తాళ్ళ గురించి స్వయానా ముఖ్యమంత్రి, మంత్రి గొప్పలు చెప్తారు గాని, గోసల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరని గ్రామ యువకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలంలోని గోనెపల్లి లో అధికారులు, నాయకులతో పాటు పారిశుద్ధ్యం పడకేసింది. పేరుమోసిన లీడర్లు ఉన్న గ్రామంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి మాత్రం జరగలేదని తెలిపారు. గ్రామంలోని అంబెడ్కర్ నగర్ లో గత నాలుగు సంవత్సరాలుగా మురుగు కాలువలు పూడిక తీయడం లేదని, గ్రామ పంచాయతీ అధికారికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పన్నులు సకాలంలో చెల్లించాలి అని వస్తారేగాని పనులు అయితే చేయరని మండిపడ్డారు.
మురుగునీరు ఆగిపోవటం వలన డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు.
నాయకులు అధికారులు ఇకనైనా మేల్కొనకపోతే స్వచ్చందంగా తామే పారిశుద్ధ్య నిర్వహణ చేసి, అనంతరం జిల్లా కలెక్టర్ గారికి మీ నిర్లక్ష్యం పై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

